ఫిల్టర్ బెడ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నగర మేయర్
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని మానేరు తీరంలో ఉన్న ఫిల్టర్ బెడ్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగర ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి శుద్ధి ప్రక్రియ, ఫిల్టర్ బెడ్ నిర్వహణ, యంత్రాల పనితీరు, నీటి నిల్వలు, పరిశుభ్రత తదితర అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించడం నగరపాలక సంస్థ ప్రధాన బాధ్యత అని అన్నారు.
తాగునీటి శుద్ధి ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా, నీటి నాణ్యతను నిరంతరం పరీక్షిస్తూ ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఫిల్టర్ బెడ్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన మరమ్మతులు మరియు నిర్వహణ పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. మేయర్ వెంట డిఇ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఇంజినీరింగ్ మరియు వాటర్ సప్లై విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






