రోడ్లపై కేజ్ వీల్స్ ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్
ఖమ్మం, జులై 13 (విజయక్రాంతి): రోడ్లపై కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్లను నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి గ్రామాల వరకు మెరుగైన రహదారులను నిర్మిస్తోందని, కాబట్టి వాటిని సురక్షితంగా ఉంచడం, రోడ్డు దెబ్బతినకుండా చూసుకోవడం అందరి బాధ్యతని అన్నారు.
వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లకు కేజ్ వీల్స్ అమర్చడం సాధారణమే అయినప్పటికీ,పొలాల వద్ద పనులు ముగిసిన తర్వాత కేజ్ వీల్స్ తొలగించిసాధారణ టైర్లు వేసుకోవాలి. లేదా రోడ్లకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయాలు వాడాలన్నారు. వ్యవసాయ పనులకు ఉపయగించే కేజ్ వీల్స్ ట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామ శివారులో కాకర్లపల్లి నుండి రుద్రాక్షపల్లి మధ్య గల R&B రోడ్డులో రోడ్లపై కేజ్ వీల్స్తో ట్రాక్టర్లు నడుపుతున్నారని, వాటితోనే రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, సంబంధిత R&B అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్లకు, యజమానులైన సారా కృష్ణ, పమ్మి కృష్ణయ్య, గుత్తి ముత్యాలరావు, బోసి కొర్రాజులు పై సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగిందన్నారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, రైతులు, ట్రాక్టర్ యజమానులు నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. ఎవరైనాని బంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించినా లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా ట్రాక్టర్ డ్రైవర్లకు, యజమానులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలాని పోలీస్ అధికారులకు ఆదేశించారు.






