2 May, 2026 | 11:11 PM

నకిలీ, నిషేధిత విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు

02-05-2026 09:39 PM

- కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,(విజయక్రాంతి): నకిలీ, నిషేధిత విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో కలుపు మందులు, నకిలీ, నిషేధిత విత్తనాల నియంత్రణపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మీరటి రాజేశ్వరిలతో కలిసి ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ క్రమంలో రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

నకిలీ, నిషేధిత విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ పరిస్థితులలో వారిని నాణ్యమైన విత్తనాల వినియోగం వైపు మళ్లించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు సాగు చేసే పంటల దిగుబడికి అవసరమైన మెలకువలను అందించడంతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన, నాణ్యమైన విత్తనాలు వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నిషేధిత కలుపు మందుల వినియోగం, తత్ఫలితంగా కలిగే నష్టాలపై వివరించాలని తెలిపారు.

నకిలీ విత్తనాలు నియంత్రణపై టాస్క్ ఫోర్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని, విత్తన, క్రిమిసంహారక విక్రయ డీలర్లు, దుకాణాలను తనిఖీ చేయాలని, నిబంధనలు పాటించని వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం సూచించిన ఈ రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని, పంట సాగులో శాస్త్రీయ, సేంద్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు దిగుబడిపై రైతులకు అవగాహన  కల్పించాలని తెలిపారు.

అనంతరం రామగుండం సీపీ మాట్లాడుతూ నకిలీ, నిషేధిత విత్తనాల విక్రయం, వినియోగం నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. గత సంవత్సరం నకిలీ విత్తనాల లభ్యత ఆధారంగా నకిలీ విత్తనాలను నిల్వచేసే ప్రాంతాలను గుర్తించి తనిఖీలు చేపట్టాలన్నారు. విత్తనాలు, క్రిమిసంహారక మందులు విక్రయించే దుకాణాలను తనిఖీ చేయాలని, నిబంధనలను ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.