నక్షబాటల ఆక్రమణపై కఠిన చర్యలు
- గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ఎమ్మార్వో గౌతమ్ కుమార్
మొయినాబాద్ ఏప్రిల్ 2(విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో నక్షబాటలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మొయినాబాద్ తహసిల్దార్ గౌతమ్ కుమార్ హెచ్చరించారు. గురువారం మొయినాబాద్ మండలంలోని బాకారం జాగీర్ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.గ్రామ సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మార్వో మాట్లాడుతూ గ్రామాలలో రైతులు, గ్రామస్తులు వెళ్లే దారులను అక్రమంగా ఆక్రమించడం సహించబోమన్నారు.
త్వరలోనే గ్రామ పంచాయతీ పొలిమేరలు, నక్షబాటలను సర్వే చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామసభ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరిన ఆయన, వేసవి కాలానికి సంబంధించిన సమస్యలను కూడా వినిపించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా నీటి సమస్యలు, ఇతర మౌలిక వసతులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై కూడా సమీక్ష నిర్వహిస్తూ, వైద్య అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుభాష్ చంద్రబోస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కే. వెంకట్ రెడ్డి, ఫారెస్ట్ ఆఫీసర్ టి. రవి ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి శివశంకర్, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




