వీధి శునకాల దాడి
19-04-2026 04:46 PM
- రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు
కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని 19వ వార్డులో వీధి శునకాల బెడద తీవ్రంగా మారింది. ఆదివారం ఓ రెండేళ్ల బాలుడు సూఫీయాన్‌పై వీధి శునకాలు దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వార్డులోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
గత కొంతకాలంగా వీధి శునకాలు స్వైర విహారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోయారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికే భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కల్వకుర్తి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి వీధి శునకాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






