6 May, 2026 | 1:54 AM

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

06-05-2026 12:39 AM

అన్నదాతకు అండగా నిలిచే ప్రభుత్వం

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

హనుమకొండ ఆరట్స్ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా

మహబూబాబాద్, మే 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతు సంక్షేమం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని, అన్నివేళలా అన్న దాతకు అండగా నిలుస్తుందని రాష్ట్ర రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

మంగళవారం హనుమకొండ జిల్లా సుబేదారిలోని ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాను రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్క, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుం డు సుధారాణి, పలువురు ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రైతులను ఉద్దేశించి మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.రైతులకు అవసరమైన ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సబ్సిడీపై అందజేస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రూ.2 లక్షల పంట రుణమాఫీ, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్, ఎకరాకు రూ.12,000 రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు 25 లక్షల మంది రైతన్నలకు 21 వేల కోట్లకుపైగా రైతులకు ప్రభుత్వం రుణమాఫీ సహాయాన్ని అం దించి అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి భూభారతి వంటి కార్యక్రమా లు చేపట్టినట్లు తెలిపారు. ప్రజా పాలన  ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్రజ ల మధ్యకే వెళ్లి, గ్రామాలు, వార్డుల స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరిస్తోందన్నారు.

అదే కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలు, మెగా రైతు మేళాలు నిర్వహిస్తూ రైతులకు నూతన సాంకేతికతను పరిచయం చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల దీవెనలతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు లక్షలాది మంది రైతులకు భారీ స్థాయిలో రుణమాఫీ చేసి అండగా నిలిచినట్లు మంత్రి తెలిపారు. రైతును రాజుగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. 

దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదగడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలే కారణమని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు.

ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా రైతుల సమస్యలపై విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారానికి నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రభుత్వం రైతుల వెంటే నిలుస్తుందని భరోసా ఇచ్చారు.రైతు బలంగా ఉంటేనే రాష్ట్రం బలపడుతుంది. రైతు ఆనందం ప్రభుత్వ ఆనందం అని మంత్రి పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా రైతులకు అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తూ, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల సంక్షేమానికి, ప్రాజెక్టుల గురించి కృషి చేశారని, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు.

గతేడాది అత్యధిక వరి పండిన రాష్ట్రంగా మన రాష్ట్రం నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నారని తెలిపారు.  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి  దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరితపిస్తున్నారని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

రైతులకు వరంగల్ వేదికగా మూడు రోజులపాటు  రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాను నిర్వహిస్తున్నారని అన్నారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి  ఏకకాలంలో రుణమాఫీ చేశారని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేశారని అన్నారు.  వరి పండించిన రైతులకు బోనస్ గా 500 రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్నారని అన్నారు.

రైతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయంలో ప్రోత్సహిస్తున్నారని అన్నారు. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.  రైతులు వ్యవసాయం చేస్తేనే కాదు రైతులు సంతోషంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటును ధరను కల్పించి ప్రతి గింజను కొనుగోలు చేస్తుందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం రైతు రాజ్య ప్రభుత్వమని అన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని చేసుకునే విధంగా సబ్సిడీ యంత్రాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, వ్యవసాయ సంబంధిత అంశాల గురించి రైతులు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, స్టేషన్ ఘన్పూర్, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద,  జిల్లా గ్రంథాలయ సంస్థ  చైర్మన్ అజిత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.