19 March, 2026 | 8:46 PM

కోటి కోసం బాధితుడిలా డ్రామా

18-03-2026 12:00 AM
  1. సొంత గ్యాంగుతో కారం చల్లించుకుని హవాలా సొమ్ము కాజేసేందుకు స్కెచ్ 
  2. కూకట్‌పల్లి దోపిడీ మిస్టరీ రట్టు
  3. బాధితుడనుకున్న ఖుస్రుద్దీనే సూత్రధారి 
  4. లక్నోకు చెక్కేస్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న ఖాకీలు
  5. నలుగురు నిందితుల అరెస్ట్
  6. రూ.77 లక్షల నగదు స్వాధీనం
  7. మరో ఐదుగురి కోసం గాలింపు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 17 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో జరిగిన రూ.కోటి దారి దోపిడీ కేసు విస్తుపోయే మలుపులు తిరిగింది. కళ్లలో కారం కొట్టి నగదు ఎత్తుకెళ్లిన ముఠా లో బాధితుడిగా నటించిన ఖుస్రుద్దీనే అస లు సూత్రధారి అని పోలీసులు తేల్చారు. హవాలా సొమ్మును కాజేసేందుకు తన మిత్రులతో కలిసి అతడు ఆడిన హైడ్రామాను కూకట్‌పల్లి పోలీసులు, బాలానగర్ సీసీఎస్ బృందాలు 24 గంటల్లోనే బట్టబయలు చేశాయి.

ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.77 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి జోన్ డీసీపీ రీతీరాజ్ మంగళవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. బహదూర్‌పురకు చెందిన ఖుస్రుద్దీన్ హవాలా నగదును రవాణా చేసే పనిలో ఉన్నాడు. ఈ నెల 16న రాత్రి సుమా రు రూ.కోటి నగదుతో కూకట్‌పల్లి మీదుగా ఖుస్రుద్దీన్ తన అనుచరుడు అజీముద్దీన్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు.

అంతకు ముందే ఆ సొమ్మును ఎలాగైనా కాజేయాలని తన మిత్ర బృందంతో కలిసి పక్కా పథకం వేశా డు. దీంతో మరో మూడు బైకులపై వచ్చిన అతని గ్యాంగ్ సభ్యులు కూకట్‌పల్లి పిల్లర్ నెం. 836 వద్ద వెంబడించారు. పథకం ప్రకారం నిందితులు ఖుస్రుద్దీన్ కళ్లలో కారం కొట్టారు.

ఆ గందరగో ళంలో బైక్ బస్సును ఢీకొట్టి వారు కిందపడ గా, నిందితులు నగదు ఉన్న కాటన్ బాక్సు ను ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కాని స్టేబుల్ అప్రమత్తమై అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కళ్లలో కా రంతో అల్లాడిపోతున్న ఖుస్రుద్దీన్‌ను బాధితుడిగా భావించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కొంపముంచిన యాక్టివా!

దోపిడీ అనంతరం పరారవుతున్న సమయంలో నిందితులు ఒక యాక్టివాను ఘట నా స్థలంలోనే వదిలేశారు. ఈ వాహనం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అది ఒక మహిళ పేరు మీద ఉన్నట్లు, దానిని బహదూర్‌పురాకు చెందిన సోహెల్ వాడుతున్నట్లు తేలింది. సోహెల్ ఫోన్ సిగ్నల్‌ను ట్రాక్ చేయగా, లోకేషన్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోహెల్ కూడా ఈ కుట్రలో భాగమేనని నిర్ధారించుకున్న పోలీసులు..

నిందితులు లక్నోకు పారిపోయేందుకు విమానం ఎక్కుతుండగా మెరుపు దాడి చేసి ఒమర్ షరీఫ్, హౌస్ సద్దాం, హమీద్‌లను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే బాధితుడిగా నటిస్తున్న ఖుస్రుద్దీన్‌ను విచారించగా, పోలీసుల వేధింపులకు తాళలేక అసలు విషయం కక్కేశాడు. తన సొంత గ్యాంగ్ తోనే ఈ దోపి డీ చేయించినట్లు అంగీకరించాడు. అరెస్టయిన నిందితుల నుంచి రూ.77 లక్షలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మిగిలిన సొమ్ముతో సోహెల్‌తో పా టు మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీసీపీ రీతీరాజ్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అత్యంత వేగంగా స్పందించిన కూకట్పల్లి ఇన్‌స్పెక్టర్, బాలానగర్ సీసీఎస్ బృందాన్ని డీసీపీ అభినందించారు. హవా లా సొమ్మును ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఉన్న అసలు యజమానులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.