26 July, 2026 | 3:59 PM

వీర్ జవాన్ దేశ్ సేవా రత్న-2026 జాతీయ అవార్డు అందుకున్న బండారి ప్రసాద్ ముదిరాజ్

26-07-2026 02:58 PM

ఆలేరు,(విజయక్రాంతి): కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవానుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ సేవలో అంకితభావంతో పనిచేస్తున్న వారిని గుర్తించి మదర్ థెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో "వీర్ జవాన్ దేశ్ సేవా రత్న - 2026" జాతీయ అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుకు తెలంగాణ, యాదాద్రి భువనగిరి, ఆలేరు మండలం మంతపురి గ్రామానికి చెందిన బండారి ప్రసాద్ ముదిరాజ్ ఎంపికయ్యారు.

పోలీసు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే, సైనిక్ యూత్ మోటివేషనల్ సొసైటీ ఫౌండర్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గ్రామీణ ప్రాంత యువతను సైన్యంలోకి వెళ్లేలా ప్రోత్సహిస్తూ, వారికి శిక్షణ ఇస్తూ దేశానికి ఎంతోమంది సైనికులను అందిస్తున్న ఆయన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. సాధారణంగా ఈ జాతీయ అవార్డును ఆర్మీ జవానులకు మాత్రమే అందజేస్తారు. అయితే తెలంగాణ పోలీసుగా ఉంటూ కూడా దేశానికి సైనికులను తయారు చేస్తున్న నిస్వార్థ సేవను గుర్తించి తనకు ఈ అవార్డును ప్రధానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ప్రసాద్ ముదిరాజ్ తెలిపారు. ఈ అవార్డు రావడం పట్ల పలువురు ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, సైనిక్ యూత్ మోటివేషనల్ సొసైటీ సభ్యులు బండారి ప్రసాద్ ముదిరాజ్ కు అభినందనలు తెలిపారు.