26 July, 2026 | 3:42 PM

ఘనంగా రిజర్వేషన్స్ డే

26-07-2026 02:42 PM

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో రిజర్వేషన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి సాహు మహారాజ్ సామాజిక న్యాయం, రిజర్వేషన్ల అమలులో చేసిన సేవలను నాయకులు స్మరించారు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, పార్లమెంట్ ఇన్‌చార్జి సి.కళ్యాణ్, జిల్లా అధ్యక్షుడు బోనాసి రాంచందర్ అడ్వకేట్ మాట్లాడుతూ... ఛత్రపతి సాహు మహారాజ్ భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు.

1902 జూలై 26న కొల్హాపూర్ సంస్థానంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. వెనుకబడిన వర్గాలు, దళితుల విద్యాభివృద్ధికి పాఠశాలలు, వసతి గృహాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా విద్య, రైతుల సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సామాజిక ఉద్యమాలకు సాహు మహారాజ్ నైతిక, ఆర్థిక మద్దతు అందించారని గుర్తు చేశారు.