21-02-2026 03:28:49 PM
చీఫ్ సూపరెండెంట్ల పాత్ర అత్యంత కీలకం
జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా క్రమబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని, ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరెండెంట్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పదవతరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరెండెంట్లు, శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు, విద్యార్థులు ఒత్తిడిలేకుండ పరీక్షలు రాయడానికి అనుకూల వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
చీఫ్ సూపరెండెంట్లు నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పాటించాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రత, సమయపాలన, పర్యవేక్షణ వంటి అంశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు విద్యార్థులకు మానసికంగా ధైర్యం చెప్పి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని , అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షలు వచ్చే నెల మార్చి 14 వ తేదీ నుండి ఎప్రిల్ 16 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు, ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 65 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష ప్రారంభానికి ముందుగానే విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని హితవు పలికారు. ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రశ్నాపత్రాలను ఆయా రూట్ల వారీగా పోలీస్ ఎస్కార్ట్ మధ్య తరలించాలని, పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేయడంతో పాటు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని తెలిపారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీటి వసతి, పరిశుభ్రమైన వాతావరణం తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను పరీక్షా కేంద్రాల్లో నియమించి, ప్రథమ చికిత్స సదుపాయం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ,
విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రశ్నాపత్రాలు, ఆన్సర్ షీట్లను తగిన భద్రత మధ్య తరలించాలని, పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు అనుమతించరాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని ఆదేశించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశం కావడంతో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ముఖ్యంగా చీఫ్ సూపరింటెండెంట్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు. గతం లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండజాగ్రత్ర వహించాలని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, అసిస్టెంట్ కమిషనర్ బలరాం, డీసీఈబీ సెక్రటరీ ఎన్.లింగం, సంబంధిత శాఖల అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.