1 August, 2026 | 3:08 AM

జూడోలో డబుల్ గోల్డ్

01-08-2026 02:18 AM

అస్మిత, హర్ష్ బంగారు పట్టు

బాక్సింగ్ రింగ్‌లోనూ జోరు

ఫైనల్లో ప్రీతి పవార్, జాస్మిన్, అరుంధతి, జాదుమణి

కామన్ వెల్త్ గేమ్స్ ఎనిమిదో రోజు జూడోలో భారత్ దుమ్మురేపింది. జూడోలో మన క్రీడాకారులు సరికొత్త చరిత్ర సృష్టించారు. హర్ష్ సింగ్, అస్మిత దే స్వర్ణాలతో మెరిసారు. అలాగే బాక్సింగ్ రింగ్ లోనూ మన బాక్సర్లు చెలరేగిపోయారు. మన పంచ్ పవర్ చూపించిన వేళ ఏకంగా ఐదుగురు బాక్సర్లు ఫైనల్లో అడుగుపెట్టారు. మహిళల విభాగంలో ముగ్గురు, పురుషుల విభాగంలో ఇద్దరు తుదిపోరుకు అర్హత సాధించారు.

గ్లాస్గో , జూలై 31 : కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ జూడో క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఎవ్వరూ ఊహించని విధంగా స్వర్ణాలు సాధించారు. మహిళల విభాగంలో అస్మిత దే, పురుషుల విభాగంలో హర్ష్ సింగ్ బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. కామన్ వెల్త్ గేమ్స్ జూడో చరిత్రలో భారత్‌కు స్వర్ణాలు రావడం ఇదే తొలిసారి. మొదట మహిళల 48 కేజీల విభాగంలోఅస్మిత అదరగొట్టింది. కెనడాకు చెందిన హైదీ క్వాచ్ను ఓడించి ఆమె స్వర్ణం గెలిచింది. తద్వారా కామన్ వెల్త్ గేమ్స్ జూడోలో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.

గత కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత జూడో క్రీడాకారులు ఐదు రజతం, ఆరు కాంస్య పతకాలు సాధించారు. త్రిపుర రాష్ట్రం బెలోనియాకు చెందిన అస్మిత భోపాల్లోని సాయ్ రీజినల్ సెంటర్‌లో సీనియర్ కోచ్ యశ్పాల్ సోలాంకి పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంది. కాసేపటికే హర్ష సింగ్ కూడా బంగారు పతకం సాధించాడు. పురుషుల 60 కేజీల విభాగంలో అద్భుత ప్రదర్శ నతో స్వర్ణం గెలిచాడు. మరోవైపు భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే 10 మంది పతకాలు ఖాయం చేయగా, ఇప్పుడు పసిడి వేటలోనూ మన బాక్సర్లు దూసుకెళ్తున్నారు.

బాక్సింగ్ రింగ్‌లో ఆధిపత్యం కనబ రుస్తూ ఐదుగురు బాక్సర్లు ఫైనల్లో అడుగుపెట్టారు.ప్రీతి పవార్, జాస్మిన్, అరుంధతి, జాదుమణి సింగ్, అంకుశ్ స్వర్ణానికి అడుగు దూరంలో నిలిచారు. శుక్రవారం జరిగిన మహిళల 54 కిలోల విభాగం సెమీస్లో ప్రీతి పవార్ అదరగొట్టింది. జాంబికాకు చెందిన జ్వాపేను చిత్తుగా ఓడించింది. అలాగే మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా కూడా ఫైనల్‌కు దూసుకెళ్ళింది. అటు మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి పూర్తి ఆధిపత్యం కనబరిచింది.