22 March, 2026 | 2:33 PM

వైభవంగా శ్రీవాసవీ మహాశక్తి మహోత్సవం

22-03-2026 12:00 AM

నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహణ

ప్రపంచ రికార్డు సృష్టించనున్న ఘట్టం

ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

విజయవంతం చేయాలని కల్వ సుజాత గుప్త పిలుపు

ముషీరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): హైదరాబాద్ ఎల్ బీ స్టేడియం మ రో అద్భుత చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. ఆదివారం ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్టు సౌజన్యంతో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది.దాదాపు 30 వేల మంది వైశ్యులు ప్రముఖ కవి చింతల శ్రీనివాస్ రచించిన 102 చరణాలతో కూడిన వాసవీ పారాయణాన్ని సామూహికంగా ఆలపించనున్నారు.

ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇన్ని వేల మంది ఒకే స్వరంతో పా రాయణం చేయడం ప్రపంచరికార్డు కానుందని నిర్వాహకులు తెలిపారు.ఈ ఘనతను రికార్డు చేయడానికి గిన్నీస్ ప్రతినిధులు వస్తున్నారని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక , సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆర్యవైశ్యులందరినీ ఒక్కతాటిపైకి తేవడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత గుప్త వెల్లడించారు. పెద్ద సంఖ్యలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని ఆమె కోరారు.శనివారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొంటున్నారు. ఏఐసీసీ సెక్రెటరీ మీనాక్షి నట రాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి టీజీ భరత్ గౌరవ అతిథులుగా పాల్గొంటున్నారు.అధికారులు జయేశ్ రంజన్, సీహెచ్‌ప్రియాంక, వేముల శ్రీనివాస్, ఆర్‌వీ కర్ణన్‌లు ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. 16 మంది పీఠాధి పతులు ఈ కార్యక్రమంలో భక్తులనుద్దేశించి మాట్లాడనున్నారు.

అనేక సంఘాల భాగస్వామ్యం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్), ఫెడరేషన్ ఆవోపాస్ ఆఫ్ ఇండియా, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ లాంటి అనేక వైశ్య సంఘాలు, సేవా సంస్థలు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీలు శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవంలో పాలుపంచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున ఈ మహోత్సవానికి స్వచ్ఛందంగా వస్తున్నారని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్టు గౌరవాధ్యక్షులు బెల్ది శ్రీధర్ తెలిపారు. హాజరు కాదలచిన వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.