6 July, 2026 | 8:13 PM

అంగన్వాడీలకు పీఎం శ్రీనిధులు కేటాయించాలి

06-07-2026 07:33 PM

– టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి పద్మ 

దమ్మపేట,(విజయక్రాంతి): అంగన్వాడి కేంద్రాలు ఉన్నచోటనే మాతా శిశు మరణాలు, పోషికాహార లోపం తగ్గుదల ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు తెలిపాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ ను అనేక సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేస్తున్నారని పాలకులే ఐసిడిఎస్ కు శత్రువుగా మారారని అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జి పద్మ అన్నారు. సోమవారం అంగన్వాడి ఉద్యోగుల సమస్యలపై స్థానిక వాసవి క్లబ్ నందు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల సదస్సు సూరమ్మ, వెంకటరమణ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ అంగన్వాడి అంటే చిన్నారులకు పౌష్టికాహారం అందించే పథకమని, ఇది ఒక చిన్న పిల్లల సంరక్షణ వ్యవస్థని, కానీ ఐసిడిఎస్ను విద్య వ్యవస్థలో అంతర్భాగం చేయటానికి జాతీయ విద్యా విధానంలో బాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, దానిని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అమలు చేస్తుందని విమర్శించారు. అంగన్వాడి కేంద్రాలలో అందుతున్న పలు సేవలను పేద ప్రజలకు అందకుండా చేయడం కోసమే మోడీ ప్రభుత్వం పిఎంశ్రీ ని ప్రవేశపెట్టిందని, అంగన్వాడి సెంటర్స్ కి వచ్చే లబ్ధిదారులతో పీఎం శ్రీ పథకాన్ని తిప్పి కొట్టాలని, పిఎం శ్రీ నిధులు ఐసిడిఎస్ లో ఖర్చుపెట్టి అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలను బలహినపరిచి అంతిమంగా మూసివేసే ఉద్దేశం బిజెపి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుందని దానిలో భాగంగానే బడ్జెట్లో కేటాయింపులలో సగం కోత విధించిందని, ఐ సి డి ఎస్ రక్షణ కోసం అంగన్వాడి ఉద్యోగులు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.