10న విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలి
ఇల్లెందు,(విజయక్రాంతి): ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని పిడిఎస్‌యూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట బంద్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యూ జిల్లా నాయకులు గంగాధర్, గణేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టుల ఖాళీలు, మౌలిక వసతుల కొరత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, హాస్టళ్ల సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాలు, యూనిఫాం, షూస్, టై, బెల్ట్‌లను బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపించారు. విద్యా వ్యాపారీకరణను అరికట్టి, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అక్రమ ఫీజు వసూళ్లను నిలిపివేయాలని, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 10న ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయుష్, చరణ్, నిఖిల్, నవ్య, కీర్తి తదితరులు పాల్గొన్నారు.






