జర్నలిస్టుల కాలనీపై రియల్టర్ల కన్ను
- కబ్జాకోరులపై చర్యకు జర్నలిస్టుల డిమాండ్
- రెవెన్యూ అధికారుల దృష్టికి ఆక్రమణ చర్య
- ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లిలో భూమాఫియా అక్రమాలు శృతి మించిపోయాయి. ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుని అక్రమ విక్రయాలు జరిపి కోట్లకు పడిగెత్తుతున్నారు. కబ్జాకోర్లు సెంటు భూమి కూడా వదలడంలేదు. భూ అక్రమాల విషయంలో కన్ను నిన్ను కానకుండా రెచ్చిపోతున్నారు. కన్నాల శివారులో జర్నలిస్టుల కాలనీకే ఎసరుపెట్టారు. ప్రభుత్వ స్థలం గతంలోనే బెల్లంపల్లి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. ఈ స్థలంలో జర్నలిస్టుల కాలనీ అని ముఖద్వారం ఆర్చి కూడా ఏర్పాటు చేశారు. జర్నలిస్టుకు కేటాయించిన స్థలం అని కూడా చూడకుండా భూకబ్జాకారులు బరుతెగించి పోయారు. జర్నలిస్టు ప్రయోజనాలను జీర్ణించుకోలేని కొందరు భూకబ్జా కార్లు అట్టి స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేశారు. ఈ స్థలంలో దొంగ చాటుగా ఆదివారం అర్దరాత్రి ట్రాక్టర్లతో చదును చేపించారు.
- అక్రమిత స్థలాన్ని పరిశీలించిన జర్నలిస్టులు
కన్నాల శివారు ప్రాంతంలో తిష్టవేసి ఉన్న భూకబ్జాదారుల మరో భూ కబ్జా ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. కన్నాల శివారులోనీ జర్నలిస్టు కాలనీ స్థలo ఆక్రమణకు భూమాఫియా తేగబడింది. ఈ సమాచారం తెలిసి జర్నలిస్టులు ఘటన స్థలికి వెళ్లి పరిశీలించారు. జర్నలిస్టు కాలనీ స్థలంలో ముందు కొంత, వెనుక భాగంలో మరికొంత స్థలంలో ట్రాక్టర్లతోటి చదును చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులియాల రాజు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని కన్నాల భూకబ్జాదారులే ఆక్రమించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
జిల్లా కలెక్టర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్, తహసిల్దారు కబ్జాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పలుకుబడి కలిగిన నాయకులే తమ స్థలాన్ని అక్రమించారని తెలిపారు. కబ్జాదారులపై చర్యలు తీసుకొనక పోతే జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఘటనా స్థలిని సందర్శించిన వారిలో జర్నలిస్టులు ఆర్.వల్లభాయ్, కోల వెంకటేష్, ముత్తే వెంకటేష్, వికాస్ యాదవ్, కలిపాక శ్రీనివాస్, ప్రతాప్ అనుదీప్, తిరుపతి, ఉప్పులేటి లక్ష్మణ్ ఉన్నారు.






