ఎద నిండా భక్తి భావం
తనువంతా తన్మయత్వం
మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపూర్ గ్రామంలోని శ్రీ నాగులమ్మ ఆలయంలో జరుగుతున్న మహా జాతరకు శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం రాత్రి నాగులమ్మ(Sri Nagamma Maha Jatara ) పగిడిద్దరాజుల కల్యాణం అనంతరం తెల్లవారుజామున ఆలయ మేనేజింగ్ ట్రస్టీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ (దేవర బాల ) లోక కల్యాణం కోసం అగ్ని గుండంలో నడుస్తున్న సమయంలో భక్తులు చేసిన నాగులమ్మ తల్లి నామ స్మరణతో జాతర ప్రాంగణం మారు మ్రోగిపోయింది.
శుక్రవారం ఉదయం ఆలయ మేనేజింగ్ ట్రస్టీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ (దేవర బాల), ఆలయ పూజారి బాడిశ నాగ రమేష్, బాడిశ నవీన్, ఇతర పూజారులు నాగులమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు తరలి వచ్చిన భక్త జనం మమ్ము చల్లంగా చూడు తల్లీ అంటూ నాగులమ్మను వేడుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
శుక్రవారం రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుండి నాగులమ్మ దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అమ్మవారిని దర్శించుకున్న భక్త జనం తనువంతా తన్మయత్వం అయ్యారు. పసుపు - కుంకుమ, కొబ్బరికాయ, ఒడి బియ్యం అమ్మవార్లకు సమర్పించి తమ కోర్కెలు తీర్చాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది. మంగళవారం ప్రారంభమైన నాగులమ్మ మహా జాతర శనివారంతో ముగియనుంది.




