గురువర్యా... ఇదేనా మీ తీరు.. !!
విద్యార్థులు లేని బడిలో.. పంతుల్ల పాఠాలు
గతేడాది నలుగురు.. ఈ సారి ‘సున్నా’ విద్యార్థులు
అయినా ఆ పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు
చోధ్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు
అచ్చంపేట, జూలై 16 (విజయక్రాంతి):
గురు బ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః ||
శ్లోకం అర్థం: గురువే బ్రహ్మ (సృష్టికర్త), గురువే విష్ణువు (పరిరక్షకుడు), గురువే పరమశివుడు (లయకారకుడు). ఆ గురువే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అటువంటి గొప్ప గురువుకు నా నమస్కారాలు. ఇలా ఉపాధ్యాయుని ఔన్నత్వాన్ని వివరిస్తుంటే.. కొంత మంది ఉపాధ్యాయులు మాత్రం.. విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రభుత్వం బడుల బలోపేతానికి నిరంతరం ప్రయత్నిస్తుంటే.. ఆయన సొంత నియోజకవర్గమైన (పుట్టిన ప్రాంతం) అచ్చంపేటలో మాత్రం పలువురు ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. దానికి ఉదాహరణే నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పనుంతల మండలంలోని రాయిచెడ్ ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. వారు మాత్రం గత రెండేళ్లుగా పాఠశాలకు వెళ్లి ముచ్చట్లతో కాలం గడుపుతూ ఉన్నారు. పాఠశాలలో విద్యార్థులు లేకపోవడమే ఈ దుస్థితికి ప్రధాన కారణం.
గతేడాది నలుగురు.. ఈ సారి సున్నా
రాష్ర్ట ప్రభుత్వం విద్యావ్యవస్థ బలోపేతం చేసేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన వసతిని కల్పిస్తోంది. అలాగే రాయిచెడ్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంది. కానీ గత రెండేళ్లుగా ఈ పాఠశాలలో విద్యార్థులు రావడం లేదంటే.. ఉపాధ్యాయుల పనితీరు.. అధికారుల పర్యవేక్షణ లోపాన్ని బహిర్గతం చేస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం పాఠశాలలో నలుగురు విద్యార్థులు చదువుకున్నారు. ఈ సారి వారిలో ముగ్గరు ప్రయివేటు పాఠశాలకు వెళ్తున్నారు. కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే పాఠశాలకు వస్తున్నాడు. కానీ వాస్తవంగా అక్కడ మాత్రం ఆ ఒక్క విద్యార్థి సైతం వెల్లడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. విద్యార్థులు లేని బడికి రెండేళ్లుగా ఇద్దరు ఉపాధ్యాయులను ఎలా కొనసాగిస్తున్నారనే ప్రశ్నకు విద్యాశాఖ అధికారుల వద్ద స్పష్టమైన సమాదానమే లేదు.
మొక్కుబడి విధులు.. లేకుంటే డుమ్మా..
రెండేళ్లుగా పాఠశాలలో ఆశించిన స్థాయిలో విద్యార్థుల నమోదు లేకున్నా.. అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. ప్రస్తుతం పాఠశాలకు వెంకటరామ్, ఆర్.లక్ష్మణ్ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిద్దరూ విద్యార్థుల సంఖ్య పెంపు గురించి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమం ద్వారా బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సంబంధిత ఉపాధ్యాయులు గ్రామంలో తగిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదని గ్రామస్థులు వాపోతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను కలుసుకుని పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు విద్యార్థులు లేకపోవడంతో ఉపాధ్యాయుల పనితీరు ఇష్టాతీరుగా మారింది. వస్తే రావడం లేదంటే.. విధులకు డుమ్మా కొట్టడం చేస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. గురువారం జిల్లా కలెక్టర్ రాయిచెడ్ లో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాల పనులను పరిశీలించేందుకు వెళ్లారు. ఆ సమయంలో పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు హాజరు కాలేదు. కలెక్టర్ గ్రామం నుంచి వెళ్లిపోయిన కొద్ది సమయం తర్వాత ఒక ఉపాధ్యాయుడు వచ్చినట్లు చెబుతున్నారు. ఒక వేళా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ఆ సమయంలో పాఠశాలకు వెళ్లి ఉంటే సదరు ఉపాధ్యాయుల పనితీరు అందరికి తెలిసేది.
సెలవులో ఒకరు..
ఈ విషయమై పాఠశాల కాంప్లెక్స్ హెచ్‌ఎం ఆంజనేయులను ఫోన్‌లో సంప్రదించగా పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటరామ్ ఆరోగ్య సమస్యతో సెలవులో ఉన్నారని చెప్పారు. అలాగే మరో ఉపాధ్యాయుడు లక్ష్మణ్ విధులకు వెళ్లిన్నట్లు తమకు చెప్పాడని తెలిపారు. ఆయన సైతం మధ్యాహ్నం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారనే విషయాన్ని ప్రస్తావించగా దానిపై విచారణ చేస్తానని తెలిపారు. విద్యార్థులు లేనందునా ఉపాధ్యాయులను మరో పాఠశాలకు పంపిస్తామని అన్నారు. విద్యార్థుల సంఖ్య ఎందుకు పెరగడం లేదనే దానికి సరైన సమాదానం లేదు. విద్యాశాఖ అధికారులు పనితీరు చూస్తుంటే.. గ్రామంలో అసలు విద్యార్థులే లేరన్నట్లుగా ఉంది. దీనిపై జిల్లా స్థాయి ఉన్నాధికారులు దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.






