17 July, 2026 | 11:30 AM

ప్రజలకు జవాబుదారీగా ఉండండి

17-07-2026 11:13 AM

 మీరు చేససే సేవలతోనే ప్రత్యేక గుర్తింపు 

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  డి.జానకి 

చిన్నచింత కుంట : ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. సీసీ కుంట పోలీస్ స్టేషన్‌ను(CC Kunta police station) జిల్లా ఎస్పీ డి.జానకి ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ పనితీరుపై సమీక్ష, ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు స్థితి, గ్రేవ్ కేసుల విచారణ, నాన్-గ్రేవ్ కేసుల పరిష్కారం, వారెంట్ల అమలు, పెండింగ్ పిటిషన్లు, కోర్టు ట్రయల్‌లో ఉన్న కేసులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఎస్పీ సమీక్షించారు. ప్రతి కేసును వేగవంతంగా, నాణ్యమైన దర్యాప్తుతో పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.నేరాల నియంత్రణకు బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, గ్రామాల వారీగా అనుమానాస్పద వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలని, పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ, ఆర్థిక మోసాల బారిన పడకుండా గ్రామస్థులను అప్రమత్తం చేయాలని సూచించారు.ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి సత్వర సేవలు అందించాలని, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా నమోదు చేసి నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఎస్పీ తెలిపారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణను కూడా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి నేరస్థులకు శిక్ష పడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలతో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని, ప్రజల్లో పోలీసులపై మరింత విశ్వాసం పెరిగేలా సేవలందించాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీసీ కుంట ఎస్‌ఐ కృష్ణ ఓబుల్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.