కాళేశ్వరంలో ప్రత్యేక వైద్య సేవలు
మహబూబాబాద్, మే 19 (విజయక్రాంతి): కాళేశ్వరంలో ఈ నెల 21 నుండి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతి మాత అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడానికి పూర్తి చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. మంగళవారం ఆయన కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన 10 వైద్య శిబిరాలు, 20 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన రెండు ఆసుపత్రులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు, హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, ప్రోగ్రాం అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో వైద్యశాల ఏర్పట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ సరస్వతి అంత్య పుష్కరాలకు భారీగా వచ్చే భక్తులకు వైద్య ఆరోగ్యశాఖ తరఫున ఎలాంటి లోటు లేకుండా సమగ్ర వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వైద్య శిబిరాలలో అవసరమైన మందులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందించే విధంగా నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన తెలిపారు.






