12 August, 2026 | 12:11 PM

ఖమ్మంపల్లిలో గుప్త నిధుల వేట..

12-08-2026 11:08 AM

అధికారుల కళ్ల ముందే తవ్వకాలు..?

పట్టపగలే భారీ గుంత.. దీని వెనుక ఎవరున్నారు?

పోలీసులు, రెవెన్యూ అధికారుల నిఘా ఎక్కడ?

ముత్తారం, (విజయ క్రాంతి): ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. పట్టపగలే గ్రామ సమీపంలోని పురాతన దేవాలయం సందెరెల్లి గుల్ల వద్ద భారీగా మట్టి తవ్వి గుంత ఏర్పాటు చేయడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయా.. లేక మరేదైనా కారణంతో ఇంత లోతుగా తవ్వారా... అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా గుప్త నిధుల కోసం రహస్యంగా తవ్వకాలు జరుగుతాయని భావిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం రాత్రి, పట్టపగలే భారీ గుంత తవ్వడం, చుట్టుపక్కల ఆనవాళ్లు కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ తవ్వకాల వెనుక ఎవరు ఉన్నారు... వారికి సహకరించింది ఎవరు? తవ్వకాలకు ఉపయోగించిన పరికరాలు ఎక్కడి నుంచి వచ్చాయి... అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ముఖ్యంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయన్న అనుమానం ఉన్నప్పటికీ సంబంధిత పోలీసు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించకపోవడంపై స్థానికులు ప్రశ్నలు సంధిస్తున్నారు. గ్రామాల్లో అనుమానాస్పద తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారం అధికారులకు చేరుతుందా...చేరితే విచారణ ఎందుకు జరగడం లేదు. అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గతంలో గుప్త నిధుల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని కూడా అధికారులు తేలికగా తీసుకోవద్దని స్థానికులు కోరుతున్నారు. తవ్వకాలు ఎవరు చేశారు. ఎందుకు చేశారు. అక్కడ ఏమైనా పురాతన వస్తువులు లేదా ఇతర ఆనవాళ్లు లభించాయా...అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అర్ధరాత్రి, పట్టపగలే ఇంత పెద్ద గుంత తవ్వే స్థాయిలో వ్యవహారం సాగితే స్థానిక పోలీసులకు, రెవెన్యూ యంత్రాంగానికి సమాచారం లేకపోవడమేంటని ప్రజలు నిలదీస్తున్నారు. అధికారుల కళ్లకు కనిపించకుండా తవ్వకాలు జరిగాయా... లేక సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోలేదా...అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి స్థలాన్ని పరిశీలించి, తవ్వకాలకు కారణాలు ఏమిటో తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గుప్త నిధుల వేట నిజమేనా, దీని వెనుక ఎవరున్నారు. అధికారులకు ముందస్తు సమాచారం ఉందా...అన్న ప్రశ్నలకు అధికారిక విచారణతోనే సమాధానం లభించాల్సి ఉంది.