20-02-2026 02:05:33 AM
రోగులకు నాణ్యమైన ఆహారం అందించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయందిర బోయి
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి) : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వివిధ మెడికల్ వార్డులను సందర్శించి, రోగులు , వైద్య అధికారుల తో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత తదితర విషయాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని. జనరల్ ఆసుపత్రిని రాష్ట్రం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తీర్చి దిద్దాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి వంటశాలను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం రోగులకు ఆహారం అందిస్తున్నారా అని అడిగారు. రోజూ సుమారు 450 మంది రోగులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తున్నామని పోషకాహార నిపుణురాలు తెలిపారు.
ఆహార నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, తరచుగా ఆహార నాణ్యత పై రోగుల నుండి అభిప్రాయాలను సేకరించి సేవలను మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆసుపత్రి డిప్యూటి సూపరింటెండెంట్ డా. సునీల్ కుమార్, సీనియర్ వైద్యురాలు డా. మాధవి, ఇతర డాక్టర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.