అక్రమ మట్టి తరలింపుపై ఎస్ఓటీ అధికారుల దాడులు
మూడు టిప్పర్ వాహనాలు - ఒక జెసిబి సీజ్
కేసు నమోదు చేసినట్టు షాద్ నగర్ పట్టణ సీఐ కె. సీతారాం వెల్లడి
షాద్‌నగర్,(విజయక్రాంతి): వివాదాస్పదంగా మూతపడిన ఓ వెంచర్లో అడిగేవారు ఉండరని కొందరు ఘనులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ పబ్బం గడుపుకుంటున్నారు. దాదాపు వెంచర్ లో ఉన్న ప్లాట్లను ధ్వంసం చేసి దాదాపు పది ఎకరాల వరకు పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు కొంతకాలంగా జరుగుతున్నట్లు సమాచారం తెలియడంతో ఎస్ఓటి పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి నిందితులను పట్టుకున్నారు.
అర్ధరాత్రి తర్వాత రహస్యంగా ఫరుక్ నగర్ మండలం(Farooq Nagar Mandal) విఠ్యాల గ్రామపంచాయతీ పరిధిలోని శ్యామలబండ తండా సమీపంలో ఉన్న అగ్రిగోల్డ్ వెంచర్ లో గత కొంతకాలంగా అక్రమ మట్టి తరలింపు కార్యక్రమం రహస్యంగా కొనసాగుతోంది. అగ్రిగోల్డ్ వెంచర్ వివాదాస్పదంగా ఉండడంతో ఇందులో ఉన్న ఇళ్ల స్థలాలు తదితర అంశాలపై కోర్టులో కేసులు గొడవలు నడుస్తున్న నేపథ్యంలో ఎవరు పట్టించుకోవడం లేదు. ఇదే అదునుగా భావించిన సదరు నాయకులు ఇందులో మట్టి తవ్వకాలు జరిపితే ఎవరికి తెలియదన్న ధైర్యంతో రాత్రింబవళ్లు కొంతకాలంగా మట్టి వ్యాపారాన్ని ప్రభుత్వం కంట పడకుండా తరలిస్తున్నారు.
విషయం బయటికి పొక్కడంతో సమాచారం సేకరించిన ఎస్వోటీ పోలీసులు రాత్రి అక్రమ మట్టి తవ్వుతున్న విషయం తెలుసుకొని వెంటనే మూడు టిప్పర్ లారీలు ఒక జెసిబి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారాన్ని పట్టణ సీఐ కె సీతారాం స్పంధిస్తు మూడు వాహనాలు ఒక జెసిబి వాహనం సీజ్ చేసిన మాట వాస్తవమేనని ద్రువీకరించారు. వీటిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. డిమాండ్ చేస్తున్నారు..




