కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కామన్ సర్వీస్ విసెంటర్ (సిఎస్ సి) ప్రారంభం
20 ఏళ్ల రేవంత్ రాజకీయ ప్రస్థానం
సంబరాలు.. రైతులకు ఒకేచోట 200+ సేవలు
చర్ల,(విజయక్రాంతి): చర్లలో శనివారం రెండు కీలక కార్యక్రమాలు జరిగాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన వేడుకలు, మరోవైపు రైతులకు సేవలు చేరువ చేసే కామన్ సర్వీస్ సెంటర్ ప్రారంభం. రెండింటిలోనూ భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు.
భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, టీపీసీసీ సెక్రటరీ నల్లపు దుర్గాప్రసాద్ పాల్గొని సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జెడ్పీటీసీ సభ్యునిగా ప్రారంభమైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేడు ముఖ్యమంత్రి స్థాయికి చేరడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధినే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) నందు నూతనంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుముకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పాస్‌బుక్ ఎంట్రీలు, పంట బీమా, ఆధార్, పాన్, రైలు, బస్, విమాన టికెట్ల రిజర్వేషన్, విద్యుత్ బిల్లుల చెల్లింపు వంటి 200కు పైగా సేవలు ఇక్కడ లభిస్తాయని తెలిపారు.






