17 August, 2026 | 4:27 AM

సోనియా క్షమాపణలు చెప్పాల్సిందే

17-08-2026 01:24 AM
  1. వందేమాతరం మధ్యలోనే ఆపడం సరికాదు
  2. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్

జైపూర్, ఆగస్టు 16: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పాపాలను ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని, వందేమాతరం ఎందుకు మధ్యలోనే ఆపారని, వెంటనే 140 కోట్ల మంది దేశ ప్రజలకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పాలని కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. ఆదివారం రాజస్థాన్‌లోని నింబహెరాలో అమిత్ షా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 21 అడుగుల ఎత్తున విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిత్తోర్‌గఢ్ సహా 15 జిల్లాల్లో రూ. 5,659 కోట్ల విలువైన 944 ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీపై విమర్శలు సంధించారు. 80 ఏళ్ల తరువాత  ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి వందేమాతరానికి దక్కాల్సిన గౌరవాన్ని పునరుద్ధరించారని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు వందేమాతరం గీతానికి గౌరవం పెరగడం సోనియాగాంధీకి, కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదని విమర్శించారు. వందేమాతరం గీతాన్ని ఆలపించినందుకు, భారతమాతకీ జై అన్నందుకు లక్షలాది మంది దేశభక్తులను ఉరితీశారని, కాల్చి చంపారని, కొట్టారని, సంవత్సరాల తరబడి జైళ్లలో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ వందేమాతరంను మరిచిపోయిందని అమిత్ షా మండిపడ్డారు.