24-02-2026 12:37:53 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 23(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ముఖ్యంగా భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌చార్జి వట్టె జానయ్య యాదవ్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో అనేక మంది ప్రజలు భూ సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
భూముల రికార్డుల సమస్యలు, పట్టాదార్ పాస్‌బుక్స్, సర్వే సమస్యలు, ఆక్రమణలు వంటి అంశాల వల్ల సాధారణ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ప్రజల సమస్యలను జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని కలెక్టర్‌ని కోరారు. అలాగే పట్టణంలో ఉన్న ఇతర మౌలిక వసతుల సమస్యలపై కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు మండలం అధ్యక్షులు బొల్లె సైదులు , మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.