సోలార్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రైతు వారంలో భాగంగా విద్యుత్ అవగాహన
గజ్వేల్, మే 7: రైతులు త్వరలో అమలు కానున్న సోలార్ విద్యుత్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ గజ్వేల్ ఏడి జగదీష్ ఆర్య అన్నారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక రైతు వారంలో భాగంగా గజ్వేల్ రైతు వేదికలో రైతులకు విద్యుత్ వినియోగం పట్ల, సోలార్ విద్యుత్ పథకాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగించేటప్పుడు బావుల వద్ద విద్యుత్ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ ప్రమాదాలు ఏ విధంగా కలుగుతాయో అవగాహన కల్పించారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సోలార్ విద్యుత్ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈలు మారుతి రావు, సత్యం, వ్యవసాయ శాఖ ఏడిఏ బాబు నాయక్, ఏఈవోలు, విద్యుత్ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.






