18 July, 2026 | 2:21 AM

బీసీ(ఏ) అమలే లక్ష్యంగా రాజీలేని పోరాటం

18-07-2026 02:10 AM

ప్రభుత్వాల వైఖరిపై భగ్గుమన్న భట్టు విఠల్ ముదిరాజ్

ఎల్లారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి): స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు మారాయి... పాలకులు మారారు... రాజకీయ పార్టీలు మారాయి... కానీ ముదిరాజ్ జాతి పరిస్థితి మాత్రం ఆశించిన స్థాయిలో మారలేదని తెలంగాణ ప్రభుత్వ ముదిరాజ్ ఉద్యోగుల సంఘం (TMGEA) రాష్ట్ర ఉపాధ్యక్షులు,

రాజనీతి శాస్త్ర నిపుణులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆయన విమర్శించారు. ముదిరాజ్ జాతికి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం GO Ms. No.15 (2009) అమలు చేసి BC-Aలో చేర్చాలనే డిమాండ్ను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. పదవులు, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు... రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసమే తమ ఉద్యమమని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ సర్వే ప్రకారం అత్యంత వెనుకబడిన వర్గాల్లో ముదిరాజ్ జాతి:

ప్రభుత్వ సామాజిక సర్వేల్లో ముదిరాజ్ జాతి విద్య, ఉపాధి, ఉద్యోగాలు, ఆర్థిక స్థితి, రాజకీయ ప్రాతినిధ్యం, మత్స్యకార హక్కులు, సంక్షేమ పథకాల అమలులో అత్యంత వెనుకబడిన వర్గాల్లో ఉన్నట్లు పేర్కొన్నారని డాక్టర్ భట్టు విఠల్ తెలిపారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ హక్కుల అమలుపై ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో దయనీయ ఆర్థిక పరిస్థితి:

గ్రామీణ ప్రాంతాల్లోని ముదిరాజ్ కుటుంబాలు ఇప్పటికీ కూలి పనులు, చిన్నచిన్న సంప్రదాయ వృత్తులు, చేపల వేట వంటి ఉపాధిపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. స్థిరమైన ఆదాయం లేక అప్పుల భారం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో అనేక కుటుంబాలు జీవన పోరాటం సాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పూర్తిస్థాయిలో అందడం లేదని అన్నారు.

విద్య లేక యువత దుస్థితి... చిన్నాభిన్నమైన కుటుంబాల భవిష్యత్తు:

విద్యా అవకాశాలు, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ముదిరాజ్ యువత తీవ్ర నిరాశలో ఉందని పేర్కొన్నారు. ఉన్నత విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారుతున్నాయని, ఉపాధి అవకాశాలు లేక చాలామంది యువకులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాల్లో అనేక కుటుంబాలు పేదరికంతో చిన్నాభిన్నమవుతున్నాయని, యువత భవిష్యత్తును కాపాడాలంటే BC-A అమలుపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగ హక్కులు సాధించే వరకు ఉద్యమం ఆగదు:

ముదిరాజ్ జాతికి రాజ్యాంగం కల్పించిన హక్కులు పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు రాజీపడే ప్రసక్తే లేదని డాక్టర్ భట్టు విఠల్ స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగాలు, ఉపాధి, రిజర్వేషన్లు, మత్స్యకార హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాల అమలులో సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.