26 August, 2026 | 4:59 AM

అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు

26-08-2026 12:00 AM

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, ఆగస్టు 25: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం రామన్నపేటలోని జీఆర్‌ఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, గత పదేళ్లుగా అర్హులైన అనేక కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు కాలేదని అన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. రామన్నపేట పట్టణంలో అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.