రోడ్డున పడ్డ చిరు వ్యాపారులు
నోటీసు లేకుండా జేసీబీలతో కూల్చివేతలు
శేరిలింగంపల్లి, మే 22 (విజయక్రాంతి): మియాపూర్ సర్కిల్ పరిధిలోని సరస్వతి విద్యామందిర్ నుంచి పీజేఆర్ స్టేడియం వరకు ఉన్న చిరువ్యాపారుల బళ్లు, డబ్బాలను టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండా జేసీబీలతో కూల్చివేశారు. దీంతో బాధితులు లబోది బోమన్నారు. అధికారుల చర్యలతో తమ జీవన పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయన్నారు. స్కూల్ ఫీజులు, అద్దెలు, ఇతరత్రాలన్నీ ఈ చిరు వ్యాపారంతోనే నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు తమ పరిస్థితి ఏంటో అని కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధితులంతా మియాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ శశిరేఖను కలిసి వినతిపత్రం అందజేశారు. తమను ఆక్రమణదారులుగా చూడొద్దని, వెండింగ్ జోన్ కేటా యించాలని, ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని, అధికారుల తీరుపై విచారణ జరిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.






