31 August, 2026 | 4:31 AM

చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

31-08-2026 02:22 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి ఆగస్టు 30: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని నేషనల్ హైవే-167 ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన అక్రమ కట్టడాలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతీయ రహదారి కావడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రజలకు సురక్షితమైన, సౌకర్య వంతమైన రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలను త్వరితగతిన చేపట్టాలని  అధికారులను ఆదేశించారు.

అయితే ఫుట్పాత్ లపై వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులకు ఎలాంటి అనవసర నష్టం, ఇబ్బందులు కలగకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. తొలగింపు చర్యలకు ముందుగా వ్యాపారులకు తగిన నోటీసులు జారీ చేయడంతో పాటు, సాధ్యమైన మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

నేషనల్ హైవేను పూర్తిస్థాయిలో అడ్డంకులు లేకుండా చేసి, పాదచారులు, వాహనదారులకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వారితో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ రత్నమాల , పట్టణ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.