‘ఆప్’ అల్లకల్లోలం
రాఘవ్ చడ్డా బాటలోనే మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులు
బీజేపీ గూటిలో చేరిక.. కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్
న్యూఢిల్లీ, ఏప్రిల్ ౨౫: ఎంపీ రాఘవ్ చడ్డా సహా ఆప్ ముఖ్యనేతలు అశోక్ మిత్తల్, సందీ ప్ పాఠక్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ, స్వాతి మాలీవాల్ ఆప్‌కి రాజీనామా చేయడంతో పార్టీ భారీ కుదుపులకు గురైంది. సరిగ్గా ఏడాది క్రితం పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌ను ఎంతో అప్యాయతతో తన ఇంటికి ఆహ్వానించిన అశోక్‌మిత్తల్, తన బంగ్లా నుంచి వెళ్లిపోయిన కొన్నిగంటల్లోనే పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం.
రాజ్యసభలో ఆప్ ఉపనేత హోదాను రాఘవ్ ను తప్పించి, ఇటీవల కేజ్రీవాల్ ఆ హోదాను అశోక్ మిత్తల్‌కు కట్టబెట్టారు. అశోక్ మిత్తల్ ఇంతలోనే చడ్డా వెంటే బీజేపీ గూటికి చేరడం ఆప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదలైన తర్వా త ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అప్పుడు సీఎం నివాసం నుంచి బయటకు వచ్చిన ఆయన్ను, మిత్తల్ తన అధికారిక నివాసంలోకి ఆహ్వానించారు. ఈనెల 24న కేజ్రీవాల్ ఆ ఇంటిని ఖాళీ చేసి తనకు ప్రభుత్వం కేటాయించిన లోథి ఎస్టేట్ బంగ్లాకు మారారు. జాతీయ పార్టీ అధినేత హోదా కింద ఆ భవనాన్ని మాజీ సీఎంకు కేటాయించారు. అలా కేజ్రీవాల్ వెళ్లిపోయిన కొన్ని గంటల్లోనే మిత్తల్ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆప్‌కు రాజ్యసభలో సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, బల్బీర్ సింగ్, లోక్‌సభలో గుర్మీత్ సింగ్, రాజ్‌కుమా ర్, మహీందర్ సింగ్ మాత్రమే మిగిలారు.






