7 July, 2026 | 6:20 PM

Breaking News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •   చనిపోయినా చిరంజీవే… ఆరుగురికి జీవం నింపిన ఏడేళ్ల యశ్వన్   •  

డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు

07-07-2026 04:57 PM

నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

- వివరాల వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు హత్య కేసుల్లో నిందితుడు వంగా సందీప్ రెడ్డికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ మంగళవారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.ఈ కేసుల్లో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగా సందీప్ రెడ్డి, బీనబోయిన దేవయ్య మధ్య భూ వివాదం కొనసాగుతూ వచ్చింది.

ఈ క్రమంలో 17 మార్చి 2018న దేవయ్య కుటుంబ వేడుకకు హాజరైన సమయంలో సందీప్ రెడ్డి కత్తితో దాడి చేసి దేవయ్యను హత్య చేశాడు. ఈ ఘటనపై దేవయ్య తండ్రి బీనబోయిన సిద్ధిరాములు ఫిర్యాదు చేయగా, అప్పటి సి.ఐ బన్సీలాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు.మరో కేసులో, కామారెడ్డి ప్రాంతానికి చెందిన మన్నె నరసింహులు,సందీప్ రెడ్డి మధ్య కూడా భూ వివాదం ఉంది.

31 జూలై 2022న నరసింహులు స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో సందీప్ రెడ్డి గొడ్డలితో దాడి చేసి నరసింహులను హత్య చేశాడు. ఈ ఘటనపై మన్నె రాజు ఫిర్యాదు చేయగా, అప్పటి సి.ఐ మొగిలి కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ సమర్పించారు.ఈ రెండు కేసుల విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్ట్ మానిటరింగ్ ఎస్‌.ఐ రవీందర్ నాయుడు, కానిస్టేబుల్ శ్రీనివాస్ తదితరులు సమగ్రంగా పని చేశారు.

మొత్తం 20 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదనలు వినిపించారు. శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి రెండు కేసుల్లోనూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సమాజంలో నేరం చేసిన వారు శిక్ష తప్పించుకోలేరని, పోలీస్-ప్రాసిక్యూషన్ సమన్వయంతో న్యాయపరమైన చర్యలు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసుల్లో కీలకంగా పనిచేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, పీపీ పెంట శ్రీనివాస్, డీఎస్పీ నాగేంద్రచారి, సి.ఐలు మొగిలి, బన్సీలాల్, వెంకటేష్, ఎస్‌.ఐ శ్రీకాంత్, కోర్ట్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.