మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం
గజ్వేల్: గజ్వేల్ మండలంలోని మక్త మాసన్‌పల్లి, శేరిపల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మంగళవారం పరామర్శించారు. మక్త మాసన్‌పల్లి గ్రామానికి చెందిన చిట్యాల యాదగిరి తన కుమారుడు విగ్నేష్‌కు అనారోగ్యం రావడంతో గజ్వేల్‌లో చికిత్స చేయించుకుని తిరిగి వెళ్తుండగా గజ్వేల్ సబ్‌స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమారుడు విగ్నేష్ (10)ను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా మాదాసు శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి, యాదగిరి మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం శేరిపల్లి గ్రామానికి చెందిన చంద్రం కుమారుడు జయంత్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జయంత్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట రమేష్ గౌడ్, శివకుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాజగౌడ్, శ్రీకాంత్, వెంకటేష్, మోహిన్ రమేష్, రాజు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






