7 July, 2026 | 6:12 PM

వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

07-07-2026 04:41 PM

- ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

గంభీరావుపేట,(విజయక్రాంతి): గంభీరావుపేట మండలంలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల విక్రయ దుకాణాలపై అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి సలావుద్దీన్, స్థానిక ఎస్‌.ఐ. శ్రీకాంత్ సంయుక్తంగా ఈ తనిఖీలను చేపట్టారు. తనిఖీల సందర్భంగా ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు, లైసెన్సులు, నిల్వలు మరియు బిల్లుల జారీ విధానాన్ని సవివరంగా పరిశీలించారు. దుకాణాల్లో ఉన్న నిల్వలను రిజిస్టర్లలో నమోదైన వివరాలతో సరిపోల్చి నిర్ధారించారు.

ఈ సందర్భంగా అధికారులు వ్యాపారులకు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రైతులకు నిర్ణీత ధరలకే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించాల్సిందిగా, ప్రతి విక్రయానికి బిల్లు ఇవ్వడం అనివార్యమని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే రైతులు కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఏవైనా అక్రమాలు గమనించినట్లయితే వెంటనే మండల వ్యవసాయ అధికారికి సమాచారం అందించాలని సూచించారు.