నూతన సబ్ స్టేషన్‌కు స్థల పరిశీలన
గరిడేపల్లి, మార్చి 20 : మండలంలోని రాయనిగూడెం గ్రామ శివారులో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని సూర్యాపేట ఎస్ ఈ శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని రాయినిగూడెం ముత్యాల నగర్, కాల్వపల్లి, సర్వారం, కాచవారిగూడెం, లింగగిరి గ్రామాల్లో తీవ్రంగా ఉన్న లో వోల్టేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో రాయినిగూడెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించినట్లు ఆయన తెలిపారు. సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చి, రైతులు, గృహ వినియోగదారులకు ఊరట లభిస్తుందన్నారు. ఆయన వెంట సర్పంచ్ గుండు రామాంజిగౌడ్, ఏఈ గన్న సాయి కృష్ణ, పంచాయతీ సెక్రటరీ సునీత, ఏఎల్‌ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.




