తాండూరులో జోరుగా గంజాయి దందా
- స్టోన్ పాలిషింగ్ యూనిట్ కార్మికులే టార్గెట్‌గా విక్రయాలు
- పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు
తాండూరు, మార్చి 20 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ పరిసర ప్రాంతాల్లో గంజాయి దందా జోరుగా సాగుతోంది. ఇక్కడికి ప్రాంతంలో స్టోన్ పాలిషింగ్ యూనిట్లు వందల సంఖ్యలో ఉండడంతో వేలాదిమంది కార్మికులుగా పనులు చేస్తుంటారు. స్టోన్ పాలిషింగ్ యూనిట్ లలో బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు సైతం జీవనోపాధి పొందుతున్నారు.
అంతేకాకుండా సిమెంట్ కర్మాగారాలు సైతం ఉండడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు కుటుంబాలతో నివసిస్తూ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు ఇతర రాష్ట్రాల నుండి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడి కార్మికులకు గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల తాండూర్ మండలం కరణ్ కోట్ పాఠశాల కు చెందిన విద్యార్థులు తరగతి గదిలోనే మత్తుగా నిద్రపోవడం చూసి ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
పాఠశాల సమీపంలో కొందరు గంజాయి చాక్లెట్లు విక్రయించడం తో విద్యార్థులు తెలియక చాక్లెట్లు తిని నిద్ర మత్తులోకి జారుకున్నట్టు తెలిసింది. తాజాగా గౌతపూర్ లోని ఓ స్టోన్ పాలిష్ సింగ్ పరిశ్రమ వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ ముక్తసిమ్ అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తూ గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తుండగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి అతడిని అరెస్టు చేసి దాదాపు నాలుగు కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
దినమంతా కష్టపడి సంపాదించిన డబ్బు గంజాయికే తగిలేస్తుండడంతో గంజాయి మత్తుకు చిత్తయ్యి కార్మికులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తాండూరు పరిసర ప్రాంతంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయిన్న విమర్శలు వినవస్తున్నాయి. స్థానికులు సమాచారం ఇస్తే హడావిడి చేస్తున్నారు తప్ప. .
ఆ తర్వాత సంబంధిత ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాలిషింగ్ యూనిట్ల కార్మికులే టార్గెట్ గా చేసుకొని గంజాయి విక్రయాల ముఠా విక్రయాలు జోరుగా సాగిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.




