5 August, 2026 | 1:56 AM

భద్రాద్రి జిల్లాలో ప్రతి ఎకరాకు సీతారామ జలాలు అందించాలి

05-08-2026 01:13 AM

ధరల పెరుగుదల, కార్మిక చట్టాలపై దాడిని ప్రతిఘటిద్దాం

ఆగష్టు 6 నుంచి ’ప్రజాచైతన్య యాత్రలు’

మీడియా సమావేశంసీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 4 (విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ప్రతీ ఎకరానికి సాగునీరు అందించి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని, ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కొల్పిన నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా డిమాండ్ చేశారు.

కొత్తగూడెం పట్టణ పరిధిలోని తాటిపల్లి రిసిడెన్సీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 7,80,000 ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం కేవలం 2,40,000 ఎకరాలకే నీరు అందే పరిస్థితి ఉందన్నారు. సుమారు 100 కిలోమీటర్లకు పైగా గ్రావిటీ కాలువలు తవ్వి స్థానిక ప్రజలను నిర్వాసితులను చేసినప్పటికీ పూర్తి స్థాయిలో జిల్లా రైతాంగానికి సాగునీరు అందించకపోవడం దుర్మార్గమైదన్నారు.

ఆయకట్టు పరిధిని పెంచి ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లోని చెరువులను నింపి సాగునీరు అందించాలని కోరారు. నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరలను నియంత్రించాలని, పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలన్నారు. కేంద్రం మార్చిన 44 కార్మిక చట్టాలను రద్దు చేయాలని, విద్య, ఉపాధి హక్కులను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా చేర్చాలని స్పష్టం చేశారు. మతోన్మాద శక్తుల నుంచి దేశ ఐక్యతను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

జిల్లాలో మిగిలిన 73,000 ఎకరాల పోడు భూములకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని, కేటీపీఎస్ సమీపంలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని, విద్యా, వైద్య రంగాలను పేదలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల సాధనకై సీపీఐ ఆధ్వర్యంలో  దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుండి 14 వరకు ‘ప్రజా చైతన్య యాత్రలు‘ అందులో భాగంగా జాతీయ, జిల్లా స్థాయి సమస్యలపై భద్రాద్రి జిల్లాలో ఏడూళ్ల బయ్యారం నుంచి అశ్వారావుపేట వరకు అన్ని మండలాలను, గ్రామాలను కలుపుతూ యాత్రలు చేపడుతున్నామని తెలిపారు.    సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో ‘దేశంలో మార్పు కోసం‘ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. యాత్రలకు అన్నివర్గాల ప్రజలు సంఘీభావం తెలపాలని కోరారు. విలేకర్ల సమేషంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్,  సలిగంటి శ్రీనివాస్, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు, చంద్రగిరి శ్రీనివాసరావు, వి పూర్ణచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.