18 June, 2026 | 3:37 AM

ఏక విద్యార్థి పాఠశాల!

18-06-2026 02:26 AM
  1. ఒక్క ఉపాధ్యాయుడితో బోధన
  2. విద్యార్థి ఇంటికి స్వయంగా వెళ్లి బైక్‌పై తీసుకెళ్తున్న ఉపాధ్యాయుడు
  3. మధ్యాహ్న భోజనం కోసం ఒక కార్మికులు
  4. ఒక విద్యార్థి, ఒక టీచర్ బడిగా మహబూబాబాద్ జిల్లా క్యాంపు తండా ప్రాథమిక పాఠశాలకు గుర్తింపు

మహబూబాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం క్యాంపు తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక విద్యార్థి ఉన్నాడు. గత ఏడాది ముగ్గురు విద్యార్థులు ఉండగా ఒక విద్యార్థి నాలుగో తరగతి, ఇద్దరు విద్యార్థులు 5వ తరగతి చదివారు. ఈ విద్యా సంవత్సరంలో ఐదో తరగతి పూర్తి చేసిన ఇద్దరు విద్యార్థులు ప్రాథమికోన్నత పాఠశాలలో చేరిపోయారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఒకే ఒక విద్యార్థి బానోత్ రీతీష్ ఉన్నాడు.

ఆ ఒక్క విద్యార్థికే ఉపాధ్యాయుడు శ్రీనివాస్ విద్యాబోధన చేస్తున్నారు. ఆ విద్యార్థి కోసం పాఠశా లను నడుపుతుండగా, ఉపాధ్యాయుడు విద్యా ర్థి ఇంటికి వెళ్లి మరీ తన బైక్‌పై కూర్చోబెట్టుకొని పాఠశాలకు తీసుకువచ్చి విద్యా బోధన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత మూడు రోజులుగా ఇదే విధానాన్ని ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అమలు చేస్తున్నాడు. ఆ ఒక్క విద్యా ర్థి కూడా బడికి రాకపోతే బడి మూతపడే పరిస్థితి నెలకొంది. ఆ విద్యార్థికి మధ్యాహ్న భోజనం కూడా వండి పెడుతున్నారు.

పాఠశాలకు వచ్చే ఏకైక విద్యార్థికి సకల సౌకర్యాలు కల్పించి, ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేసి విద్యాబోధన చేస్తున్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఒకప్పుడు పిలవబడే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు క్యాంపు తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి ‘ఏక విద్యార్థి పాఠశాల’లగా మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇదిలా ఉండగా క్యాంపు తండా ఆవాస ప్రాంతంలో ప్రీప్రైమరీ ఏజ్ గ్రూప్ విద్యార్థులు నలుగురు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో అభ్యసించే వయసుగల విద్యార్థులు ఐదుగురు ఉన్నప్పటికీ వారిని ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు.