అప్పుల ఊబిలోకి సింగరేణి
- వెయ్యి కోట్ల భారీ స్కాం
- 40 లక్షల టన్నుల బొగ్గు గల్లంతు
- ఓబీ రిమూవల్‌లో కోట్ల దందా
- సోలార్, డీజిల్, బొగ్గు స్కాంల పరంపర
- కాంగ్రెస్‌పై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), జూన్ 12 (విజయక్రాంతి): సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని, సింగరేణిలో భారీ అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్‌నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణిలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల స్కాం జరిగిందని, బొగ్గు ఉత్పత్తిలోనే 40 లక్షల మెట్రిక్ టన్నుల గల్లంతు అయ్యిందని, భూపాలపల్లి ఏరియాలో లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా చూపించడంలేదని ఆరోపించారు. శుక్రవారం భూపాలపల్లి ప్రాంతంలో పర్యటించిన హరీశ్‌రావు, ఓసీ 2 మైన్‌ను సందర్శించేందుకు ప్రయత్నించగా సేఫ్టీ నిబంధనల పేరుతో అనుమతి నిరాకరించారని తెలిపారు.
అనంతరం బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. సింగరేణిలో సోలార్ పవర్, డీజిల్ వినియోగం, ఓబీ రిమూవల్, బొగ్గు ఉత్పత్తి వంటి విభాగాల్లో భారీ స్కాంలు జరుగుతున్నాయని విమర్శించారు. ఓబీ రిమూవల్‌లో సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ పేరుతో అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టులు ఇస్తున్నారని, గతంలో మైనస్ బిడ్డింగ్ ఉండగా ఇప్పుడు ప్లస్ బిడ్డింగ్‌తో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు.
సోలార్ ప్రాజెక్టుల విషయంలో ఒక్క మెగావాట్‌కు సాధారణంగా రూ.3 కోట్లు ఖర్చు అవుతుండగా, సింగరేణిలో అదే ప్రాజెక్టుకు రూ.7 కోట్ల వరకు ఖర్చు చూపిస్తూ అక్రమాలు తెర లేపారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు లేకుండానే ఉత్పత్తి ప్రారంభించారని, భూపాలపల్లి ఏరియాలో బొగ్గు నిల్వలపై కూడా స్పష్టత లేదని, కార్మికులతో మాట్లాడితే మైన్స్‌లో బొగ్గు లేదని చెపుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్పత్తి గణాంకాలను తక్కువగా చూపించి లోటును దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
సింగరేణి అప్పుల విషయానికొస్తే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు రూ.19 వేల కోట్ల అప్పు ఉండగా, తమ పాలనలో సంక్షేమ పథకాల కోసం అప్పులు తీసుకున్నప్పటికీ అభివృద్ధి చేశామని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తక్కువ కాలంలోనే రూ.20 వేల కోట్లకు పైగా అప్పు చేసి సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు.






