6 July, 2026 | 5:01 PM

8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు

06-07-2026 04:04 PM

అప్‌గ్రేడేషన్, పి.ఆర్.పి. తక్షణమే అమలు చేయాలని డిమాండ్ 

సత్తుపల్లి,(విజయక్రాంతి):  కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (CMOAI) సింగరేణి శాఖ, సత్తుపల్లి ఏరియా ఆధ్వర్యంలో సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షకులకు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాలు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విటల్ రావు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కోలిక పోగు సర్వేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జాజిరి శ్రీనివాసరావు. సిఐటి నాయకులు చెరుకు శ్రీనివాసరావు పాల్గొని వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతును తెలియజేశారు.

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయం ఎదుట అధికారులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజు జరిగిన దీక్షలో డీజీఎం (ఈ అండ్ ఎం) కిష్టారం ఓసీపీకి చెందిన జి.వి. రావు, ఈఈ (ఈ అండ్ ఎం) జేవీఆర్ ఓసీపీకి చెందిన కె. జగదీష్, ఈఈ (ఈ అండ్ ఎం) జేవీఆర్ సీహెచ్‌పీకి చెందిన జి. శ్రీనివాస్, సీనియర్ యూ.ఎం జేవీఆర్ ఓసీపీకి చెందిన మహమ్మద్ జహీద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు "పే అప్‌గ్రేడేషన్ – పి.ఆర్.పి. మా హక్కు" అనే నినాదాలతో తమ డిమాండ్లను వినిపించారు. సింగరేణి ఎగ్జిక్యూటివ్ అధికారులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పే అప్‌గ్రేడేషన్‌ను వెంటనే అమలు చేయాలని, నిలిపివేసిన పర్‌ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పి.ఆర్.పి.) బకాయిలను ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, సంస్థ అభివృద్ధికి అధికారులు నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ వారి న్యాయమైన సమస్యలను యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షా శిబిరంలో అధికారులు "జై సి.ఎం.ఓ.ఎ.ఐ... జై జై సి.ఎం.ఓ.ఎ.ఐ..." అంటూ నినాదాలు చేస్తూ సంఘీభావం ప్రకటించారు.