6 July, 2026 | 4:54 PM

ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి

06-07-2026 04:08 PM

పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

టూరిజం శాఖ అధికారులకు కీలక సూచనలు  

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపై నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం నాడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని( Tourism Sector) అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీ (BharatFutureCity) పరిధిలోని అటవీ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులుగా తీర్చిదిద్దాలని సూచించారు. నగరంలోని పర్యాటక ప్రాంతాలను మరింతగా తీర్చిదిద్దాలని, తారామతి బారాదరి మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంజీరా, దిల్‌కుషా అతిథి గృహాలను ఆధునికీకరించాలని ఆదేశించారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద  వికారాబాద్(Vikarabad)ను అభివృద్ధి చేయాలని, ప్రధానంగా వికారాబాద్‌లోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. యాదగిరిగుట్ట తరహాలో దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

క్యూర్ పరిధిలో అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, అందుకోసం ప్రత్యేక అధికారులను నియమించి పనులను ముమ్మరం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. నగరంలో పురానాపూల్ వంటి వారసత్వ సంపదగా నిలిచిన బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి చేసిన తర్వాత అవసరమైతే ట్రాఫిక్‌ను మరో మార్గం నుంచి మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు సంబంధించి అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్ వచ్చే డిసెంబర్‌లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ (Global Investment Summit)పై కసరత్తును ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి ఈ సమ్మిట్ కోసం వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.