వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్
కరీంనగర్,(విజయక్రాంతి): వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, పాలకమండలి సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం ఆహ్వానం మేరకు టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగుల సమస్యలు, శాఖ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆకుల నరసన్న, పాలకమండలి సభ్యులు, ఉద్యోగులు, రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు తదితరులను సన్మానించారు.
అనంతరం టీఎన్జీవోస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న ను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, రైతుల కష్టసుఖాలు తెలిసిన యువ నాయకుడు ఆకుల నరసన్న మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులు కావడం అభినందనీయమని, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. "దేశానికి వెన్నుముక రైతులైతే, రైతుకు వెన్నుముక వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలతో కలిసి నిరంతరం కృషి చేస్తాం" అని హామీ ఇచ్చారు.






