6 July, 2026 | 5:00 PM

ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

06-07-2026 04:08 PM

– ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో  ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

కడెం మండలం దోస్తునగర్ గ్రామానికి చెందిన మారుతి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. బోథ్ మండలం అందూరు గ్రామానికి చెందిన ఆత్రం గంగారాం రైతు భరోసా పథకం లబ్ధి కల్పించాలని కోరారు. జైనూర్ మండలం జైనూర్ గ్రామానికి చెందిన దివ్యభారతి ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. నార్నూర్ మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రవళిక ల్యాప్‌టాప్ మంజూరు చేయాలని వినతి సమర్పించగా, కౌటాల మండలం కౌటాల గ్రామానికి చెందిన గ్రామస్తులు పట్టాల మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు.

అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.