28 February, 2026 | 4:40 AM

మిథేన్ అన్వేషణనకు సింగరేణికి అవకాశం

28-02-2026 01:09 AM

సీఎండీ బుద్ధా ప్రకాశ్ జ్యోతితో ఏడీజీ సచివ్ కుమార్ భేటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : బొగ్గు అన్వేషణలో 13 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు బొగ్గు పొరలలో ఉన్న మిథేన్ గ్యాస్ వనరుల అన్వేషణకు అవకాశం లభించనుంది. కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ సింగరేణి ప్రాంతంలో గుర్తించిన మూడు ప్రధాన బ్లాక్‌ల అన్వేషణలో పాల్గొనాల్సిందిగా ఆ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికా రులు శుక్రవారం సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ బుద్ధా ప్రకాశ్ జ్యోతిని కలిసి కోరారు.

దేశ వ్యాప్తంగా ఈ వాయువును ఉత్పత్తి చేయడానికి పలు రాష్ట్రాల్లో బ్లాక్‌లను గుర్తించారని, దీనిలో ప్రాణహిత గోదావరి లోయ ప్రాంతం కూడా ఉందని, దీనికి సంబంధించి ముందు గా అన్వేషణ జరపడానికి త్వరలో కేంద్ర పెట్రోలియం శాఖ వేలం నిర్వహించబోతోందని తెలిపారు. సింగరేణి సంస్థ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీటిలో సింగరేణిలో ప్రాంతంలో ఆరు జిల్లాల్లో మూడు ప్రధాన బ్లాక్‌లను గుర్తించామని తెలిపారు.

వీటిలో మంచిర్యాల, పెద్దపల్లి, కొమరమ్ భీమ్, ఒక బ్లాక్‌గా(5 బిలియన్ క్యూబిక్ మీటర్ల వనరులు ), భద్రాద్రి కొత్తగూడెంలో ఒక బ్లాక్ (2 బిలియన్ క్యూబి క్ మీటర్ల), భద్రాద్రి కొత్తగూడెం, ములుగు కలిపి ఒక బ్లాక్‌గా(12 బిలియన్ క్యూబిక్ మీటర్ల)  గుర్తించారని, ఈ బ్లాక్ ల్లో అన్వేషణ జరపడానికి సింగరేణి సంస్థ త్వరలో జరిగే వేలంలో పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ మూడు బ్లాక్‌లలో దాదాపు 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల మిథేన్ గ్యాస్ వనరుల లభ్యత ఉన్నట్లు ప్రాథమిక అంచనా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనపై కూలంకశంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎండీ డాక్టర్ బుద్ధాప్రకాశ్ జ్యోతి పేర్కొన్నారు.