4 May, 2026 | 3:10 AM

అది చీకటి జీవో

04-05-2026 01:59 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దుచేసేందుకే జీవో 7

14లక్షల మంది విద్యార్థులకు రేవంత్ వెన్నుపోటు

  1. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన సీఎం 
  2. విద్యాశాఖ విధ్వంసానికే నీ వద్ద పెట్టుకున్నావా రేవంత్? 
  3. కేసీఆర్ స్కీంలకే కాదు.. వైఎస్ పథకాలకూ పాతరేస్తావా?
  4. ఓ వైపు గురుకులాలను దెబ్బతీసి.. ఉన్నత విద్యకూ ఉరివేస్తావా?
  5. దుర్మార్గమైన జీవోను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి 
  6. విద్యార్థిలోకం గర్జిస్తే రోడ్లపై తిరగలేరని గుర్తుపెట్టుకోండి
  7.   10 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదలచేయాలి 
  8. సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు లేఖ

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): రెండున్నరేళ్ల మీ అసమర్థ పాలనలో ఇప్పటికే విద్యావ్యవస్థను కుప్పకూల్చి క్షమించరాని పాపాన్ని మూటగట్టుకున్నారని, ఇప్పుడు ఏకంగా ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేసేలా విద్యార్థులను వెన్నుపోటు పొడుస్తారా? అని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా రిటీ విద్యార్థులకు కొండంత అండగా నిలిచే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దుచేసేలా మీరు చేస్తున్న కుట్ర భయంకరమైనదని, మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7 ముమ్మాటికీ ఫీజుల పథకానికి పాతరేసేందుకు చేస్తున్న కుటిల ఎత్తుగడగా తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందని స్పష్టంచేశారు. ఈ జీవో వచ్చిన క్షణం నుంచి విద్యార్థులకే కాదు, లక్షల మంది నిరుపేద తల్లిదండ్రులకు కూడా కంటి మీద కునుకు కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు.

పిల్లల భవిష్యత్తుపై గంపెడాశలు పెట్టుకున్న తల్లి దండ్రుల ఆశలు మీ ప్రభుత్వ దిక్కుమాలిన చర్యలు నీళ్లు జల్లుతున్నాయని, ఇప్పటికే గురుకుల వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చడంతో 142 మందికిపైగా చందమామల్లాంటి పిల్లలు తనువు చాలించారని, కనీసం సరైన భోజనం కూడా కల్పించలేని చేతకాని సర్కారు వల్ల ఇప్పటికీ వేల మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతూనే ఉన్నారని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రాజకీయాలకతీతంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కూడా కొనసాగించి విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి గ్రహణం పట్టిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను ఇప్పటికే గాలికొదిలేసి నాలుగు కోట్ల ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు.

చివరికి గతంలో మీ సొంత పార్టీ ప్రభుత్వం అమలుచేసిన ఫీజుల పథకానికి తూట్లు పొడవడానికి మీకు సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆర్థిక స్థోమత లేని నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించే ఈ పథకాన్ని సమాధి చేసేలా విడుదల చేసిన జీవో 7 ముమ్మాటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేసేందుకు తెచ్చిన చీకటి జీవో మాత్రమేనని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ఈ జీవో 7ను వెంటనే వెనక్కి తీసుకుని, విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేశారు. 

మీ నయవంచన విధానాలకు నిదర్శనం..

విద్యకోసం చేసే ఖర్చును ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడిగా, బాధ్యతగా చూడాలే తప్ప, భారంగా భావిం చి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న దారుణమైన నిర్ణయం వల్ల అత్యధికంగా నష్టపోయేది సమాజంలోని బడుగు, బలహీనవర్గాల పిల్లలే అని స్పష్టంచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,500కుపైగా నడుస్తున్న ఉన్నత విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఒక్క పైసా చెల్లించకుండా రెండున్నరేళ్లుగా తీవ్ర వేధింపులకు గురిచేశారని, పైగా బాకీల చెల్లింపు విషయంలో వన్ టైమ్ సెటిల్‌మెంట్ పేరిట కొంతకాలం, ట్రస్ట్, టోకెన్ల పేరిట ఇంకొంత కాలం, కమిటీల పేరిట మరికొన్ని రోజులు మభ్యపెట్టారని విమర్శించారు. చివరికి అసలుకే ఎసరు తెచ్చిన మీ దివాళాకోరు విధా నాన్ని చూసి విద్యార్థి లోకం తీవ్రంగా అసహ్యించుకుంటున్నదని తెలిపారు.

పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోవడంవల్ల కళాశాలలు నడపలేక యాజమా న్యాలు బంద్ పాటిస్తే, మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విజిలెన్స్ దాడుల పేరిట కళాశాలలపై బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. చివరికి రూ. 1,207 కోట్లు విడుదల పేరిట ఇచ్చిన టోకెన్లకు నేటికీ దిక్కులేకుండా పోయిందని, వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సిన నిధులకు రెండున్నరేళ్లుగా బ్రేకులు వేయడం వెనుక ఉన్న అసలు కుట్ర ఇప్పుడు స్పష్టంగా బయటపడిందని వెల్లడించారు.

గత 30 నెలల్లో మూడు పైసలు కూడా విడుదల చేయని మీ ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థుల ఖాతాలో నేరుగా ఫీజు లు జమచేస్తామంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. విశ్వసనీయత కోల్పోయిన మీ సర్కారు చెప్పే బూటకపు మాటలకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో జీరో వాల్యూ అని స్ప ష్టంచేశారు. 2026--27 విద్యాసంవత్సానికి తెచ్చిన మార్గదర్శకాలన్నీ.. ఫీజు రీయిం బర్స్ మెంట్ పథకాన్ని శాశ్వతంగా సమాధి చేసే మరణశాసనాలుగానే కనిపిస్తున్నాయని విమర్శించారు.

ఇలాంటి కొర్రీల వల్ల, తమ పిల్లలకు కళాశాలల్లో కనీసం అడ్మిషన్స్ లభిస్తాయా అనే భయం పేద తల్లిదండ్రులను వెంటాడుతున్నదని, గత రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకీల వల్ల కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇరుక్కుపోయి విద్యార్థులు పడుతున్న అవస్థలకు లెక్కే లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల బారాన్ని మోపి, వారిని అప్పుల పా లుచేసే సర్కారు కుట్రలను ఎట్టిపరిస్థితుల్లో బీఆర్‌ఎస్ ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అలాగే రూ.10 వేల కోట్ల బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్నే ప్రభుత్వం నేటికీ చెప్పకపోవడం మీ నయవంచన విధానాలకు నిదర్శనమని విమర్శించారు. 

మంత్రులు రోడ్లపై తిరగలేరు..

అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన గ్యారెంటీలు, 420 హామీల మాట దేవుడెరుగు, చివరికి ఉన్న పథకాలను కూడా ఊడగొట్టడం మీ రెండున్నరేళ్ల అసమర్థ పాలనకు నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. ఓ వైపు రూ.3.75 లక్షల కోట్ల అప్పులు చేసినా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం దుర్మార్గం కాకపోతే మరేమిటని నిలదీ శారు.

ఇప్పటివరకు ఒక్క ఇటుక పేర్చకుం డా, ఒక్క గ్యారెంటినీ కూడా పూర్తిగా అమలుచేయకుండా ఇన్ని లక్షల కోట్ల సొమ్ము ఎటుపోతున్నట్టో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మూడుసార్లు రైతుబంధును ఎగ్గొ ట్టి అన్నదాతల వెన్నువిరిచారని, ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలు చరిత్రలో  ఏనా డూ చూడలేదని మండిపడ్డారు.

రైతుబంధును ఎగ్గొట్టేందుకు పూటకో అడ్డదారు లు తొక్కినట్టే, ఫీజుల పథకానికి మంగళం పాడేందుకు రకరకాల దొడ్డిదారులు వెతకడం, పేద విద్యార్థులకు వెన్నుపో టు పొడ వడమేనని స్పష్టంచేశారు. ఇప్పటికే మీ దద్దమ్మ పాలనలో సకల సంక్షోభాలు చుట్టుముట్టి ఆర్థికంగా చితికిపోతున్న పేద కుటుం బాలు, తమ పిల్లల ఫీజుల బారాన్ని ఎలా మోస్తాయని ప్రశ్నించారు.

యూరియా సం క్షోభం నుంచి తప్పించుకునేందుకు యాప్ పేరిట నయా నాటకానికి తెరతీసినట్టే, ఫీజుల పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చీకటి జీవో ముసుగులో ఇంతటి నీచానికి ఒడిగట్టిన మీరు శాశ్వతంగా విద్యార్థుల దృష్టిలో ద్రోహిగానే మిగిలిపోతారని తెలిపారు.

ప్రభుత్వా నికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా తెచ్చిన చీకటి జీవోను వెనక్కి తీసుకోవాలని సూచించారు. అప్పటివరకు మిమ్మల్ని, మీ ప్రభు త్వాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలో ఉన్న 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేద విద్యార్థులతో దండుకట్టి కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు.