11 March, 2026 | 9:03 AM

అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

11-03-2026 01:18 AM

దండేపల్లి (లక్షెట్టిపేట), మార్చి 10: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగు తున్న అభివృద్ధి పనులను కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం పరిశీలించారు. రాజంపేట గ్రామంలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఆశ్రయం పొందుతున్న వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ పక డ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

ద్వారక గ్రామం లో గల షెడ్యూల్ తెగల సంక్షేమ వసతి గృహ నిర్మాణ పనులను సందర్శించి పనులు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాల న్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యాబోధన తీరు అంశాలను పరిశీలించి విద్యా ర్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య బోధన చేయాలని, వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 

అనంతరం గ్రామంలోని గోదావరి నది తీరం సమీపంలో పుష్కర ఘాట్ ఏర్పాటుపై అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వెల్గనూరు గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రెబ్బెనపల్లిలో ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల స్థలాన్నీ పరిశీలించి నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యా హ్న భోజనం, విద్యాబోధన తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాన్ని పరిశీలించి పల్లె దవాఖానను సం దర్శించారు. అనంతరం గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయాన్ని మండల  తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి ఆలయ అభివృద్ధి, వాహనాల పార్కింగ్ అంశాలను పరిశీలించి పర్యాటక రంగ అభివృద్ధి దిశగా అవసరమైన భూములను పరిశీలించి వివరాలతో నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖ ల అధికారులు తదితరులున్నారు.