20 June, 2026 | 2:54 AM

గర్భిణీలకు ‘సికిల్ సెల్ ఎనీమియా’ పరీక్షలు తప్పనిసరి

20-06-2026 01:38 AM

 ఇటిక్యాల మండల వైద్యాధికారి డాక్టర్ రాధిక 

ఇటిక్యాల, జూన్ 19: ప్రతి గర్భిణీ మహిళా తప్పనిసరిగా సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు చేయించుకోవాలని ఇటిక్యాల మండల వైద్యాధికారి డాక్టర్ రాధిక సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణీలకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

అనంతరం డాక్టర్ రాధిక మాట్లాడుతూ... గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు గాను గర్భిణీలు ప్రతిరోజూ సమతుల్య పౌష్టికాహారాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే సంబంధిత ప్రభుత్వ వైద్య సిబ్బందిని లేదా ఆశా కార్యకర్తలను సంప్రదించి తగిన సలహాలు, చికిత్స పొందాలన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలకు అందిస్తున్న ఉచిత వైద్య సేవలను, పరీక్షలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎన్‌ఎమ్ లు, ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో గర్భిణీలు పాల్గొన్నారు.