5 June, 2026 | 9:12 PM

వర్గల్‌లో వైభవంగా శ్రవణ నక్షత్ర మహోత్సవం

05-06-2026 08:01 PM

- శ్రీ శారదా స్మార్త వేద విద్యాలయ ప్రవేశ పరీక్షలు నిర్వహణ – 22 మంది విద్యార్థుల ఎంపిక

గజ్వేల్:  వర్గల్ శ్రీ విద్యా సరస్వతి క్షేత్రానికి అనుబంధంగా నిర్వహిస్తున్న శ్రీ శారదా స్మార్త వేద విద్యాలయం ప్రవేశ పరీక్షలు శుక్రవారం  నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో, వేద గురువులు ఆచార్య అభిరాం శర్మ, వేద విద్యాలయ అధ్యక్షులు గుండేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 22 మంది విద్యార్థులను వేద విద్యాభ్యాసానికి ఎంపిక చేశారు. అలాగే క్షేత్ర ప్రాంగణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో  శ్రవణ నక్షత్ర మహోత్సవం వైభవంగా సాగింది.

వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలతో పాటు మహాప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ, ప్రాచీన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా వర్గల్ క్షేత్రానికి అనుబంధంగా శ్రీ శారదా స్మార్త వేద విద్యాలయాన్ని స్థాపించి రెండున్నర దశాబ్దాలుగా వేద విద్యను సమాజానికి అందిస్తున్నామని తెలిపారు. ఆధునిక విద్యతో పాటు వేద జ్ఞానాన్ని సమన్వయం చేసి విద్యార్థులను పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వేదాల సారాన్ని సమాజానికి పంచడమే విద్యాలయ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. వర్గల్ వేద విద్యాలయంలో విద్యనభ్యసించిన అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో సేవలందిస్తున్నారన్నారు.