30 July, 2026 | 1:39 PM

వంతెన లేక నేటికీ అవస్థలు.

30-07-2026 12:58 PM

హై లెవెల్ బ్రిడ్జి మంజూరు చేయాలి: సీపీఎం నేత దుర్గం దినకర్

వాంకిడి, జూలై 30 (విజయక్రాంతి): వాంకిడి మండలంలోని కిరిడి  గ్రామంలో పాఠశాల సమీపంలో ఉన్న ఒరే నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోవడంతో గ్రామ ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే ఓర్రె ను దాటాల్సిన పరిస్థితి నెలకొన్నదని, వరద ఉధృతి కారణంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గ్రామానికి రాకపోకలు సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు .గతంలో జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి సమస్యను పరిశీలించినప్పటికీ, నేటి వరకు హై లెవెల్ వంతెన మంజూరు కాలేదని పేర్కొన్నారు. మండల ప్రజాప్రతినిధులు పలుమార్లు హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కిరిడి గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే మంజూరు చేసి, గ్రామ ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని దుర్గం దినకర్ ప్రభుత్వాన్ని కోరారు.