30 July, 2026 | 1:39 PM

నర్మాలలో మరణ మృదంగం

30-07-2026 12:43 PM

ఒకే రోజు వేర్వేరు కారణాలతో నలుగురి మృతి...గ్రామంలో విషాద ఛాయలు

గంభీరావుపేట, జూలై 30 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం(Narmala village) గురువారం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వేర్వేరు కారణాలతో ఒకే రోజులో నలుగురు గ్రామస్థులు మృత్యువాత పడటంతో గ్రామమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఎప్పుడూ చూడని ఈ దుర్ఘటనతో గ్రామంలో కన్నీటి వాతావరణం నెలకొంది.

గ్రామానికి చెందిన గెరిగంటి శ్రీహరి (45) ఉపాధి కోసం మస్కట్‌లో పని చేస్తుండగా బుధవారం గుండెపోటుతో ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ వార్త కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇక శ్రీహరి మరణ వార్త విని కుటుంబ సభ్యులతో కలిసి విలపిస్తున్న మాజీ సర్పంచ్ ధ్యానబోయిన ఎల్లవ్వ (65) ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను వెంటనే సిద్ధిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించి ఆమె కూడా మృతి చెందడం కుటుంబాన్ని మరింత దిగ్బ్రాంతికి గురి చేసింది. అలాగే బత్తిని దశరథం (50) అక్క లింగన్నపేట గ్రామంలో మరణించగా, అతని అంత్యక్రియలకు హాజరైన తమ్ముడు ఈ దుఃఖాన్ని తట్టుకోలేక రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. మరోవైపు కర్రోళ్ల పోచయ్య (60) అనారోగ్యంతో కన్నుమూశాడు.

ఒకే రోజు నలుగురు మృతి చెందడంతో నర్మాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా గ్రామస్తుల హృదయాలు ఒక్క సారిగా బరువెక్కాయి.తమ గ్రామంలో ఇలాంటి ఘటన మా ఎరుకలో ఎన్నడూ జరగలేదని  పలువురు గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు.అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.దీంతో ప్రతి ఇంట్లోనూ శోక వాతావరణం చోటు చేసుకుంది.